(ఇది కృష్ణద్వైపాయన వ్యాసుడు రచించిన 'పద్మ పురాణము' నుండి గ్రహించబడినది. నారద మరియు శౌనక ఋషులతో సత్యవ్రతముని పలికినది.)
'కార్తీక మాసములో ప్రతి ఒక్కరూ ప్రతి రోజు 'దామోదరాష్టకము' అను ఈ స్తోత్రముతో దామోదర భగవానుని అర్చించవలెను. ఇది సత్యవ్రత ముని చేత రచించబడినది మరియు దామోదరుని ఆకర్షించునది.'
-శ్రీ హరిభక్త విలాసము (2.16.198)
(1) నమామీశ్వరం సచ్చిదానందరూపం
లసత్కుండలం గోకులే భ్రాజమానమ్
యశోదాభియోలూఖలాద్ధావమానం
పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా
(2) రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం
కరాంభోజయుగ్మేన సాతంకనేత్రమ్
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ-
స్థితగ్రైవ-దామోదరం భక్తిబద్ధమ్
(3) ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే
స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్
తదీయేషితజ్ఞేషు భక్తైర్జితత్వం
పునః ప్రేమతస్తం శతావృత్తి వందే
(4) వరం దేవ మోక్షం న మోక్షావధిం వా
న చాన్యం వృణేఽహం వరేషాదపీహ
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం
సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః
(5) ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్-
వృతం కుంతలైః స్నిగ్ధరక్తైశ్చ గోప్యా
ముహుశ్చుంబితం బింబరక్తాధరం మే
మనస్యావిరాస్తామలం లక్షలాభైః
(6) నమో దేవ దామోదరానంత విష్ణో
ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నమ్
కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను-
గృహాణేశ మామజ్ఞమేధ్యక్షిదృశ్యః
(7) కువేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్
త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ
తథా ప్రేమభక్తిం స్వకాం మే ప్రయచ్ఛ
న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ
(8) నమస్తేఽస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే
త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే
నమో రాధికాయై త్వదీయప్రియాయై
నమోఽనంతలీలాయ దేవాయ తుభ్యమ్
(1) శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు, సొర చేప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుచున్న చెవి లోలుకులను కలిగి ఉన్నవాడు, దివ్యధామమైన గోకులములో ఎంతో సౌందర్య వంతముగా ప్రకాశించువాడు, యశోదామాత చిలుకుతున్న వెన్నకుండను పగులకొట్టి, ఉత్తికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగిలించుటమనే అపరాధము చేయుటచే భయపడి చెక్కరోలు పై నుండి దుమికి వేగముగా పరుగెత్తువాడు, కానీ అతని కంటే వేగంగా వెంటబడిన యశోదామాత చేత పట్టుబడిన వాడైనట్టి దేవాదిదేవుడైన శ్రీ దామోదరునికి నా వినయ పూర్వక ప్రణామములు.
(2) తల్లి చేతిలో బెత్తమును చూసి అతడు ఏడుస్తూ, రెండు కళ్ళను తన కమల హస్తాలతో పదే పదే నులుముకుంటున్నాడు. అతడి కళ్ళు భయముతో నిండి ఉన్నాయి, మరియు అతడి (శంఖమువలే మూడు రేఖలను కలిగినట్టి ఆతని కంఠములో గల ముత్యాల హారము) అతడు ఏడ్వటం వలన కలిగే దీర్ఘశ్వాస చేత ఊగుతూ ఉన్నది. అతడి ఉదరము తాడు చేత కాక, తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధింపబడినది. అటువంటి దేవాదిదేవుడైన శ్రీ దామోదరునికి నా వినయ పూర్వక ప్రణామములు.
(3) ఇటువంటి బాల్యలీలలతో అతడు గోకులవాసులను పారవశ్యమనే కుండములలో ముంచెత్తుతున్నాడు. గౌరవ ప్రపత్తులు మిశ్రితము కాని, విశుద్ధ ప్రేమ, ఐశ్వర్యభావ రాహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్యభావనలో మునిగిన తన భక్తులకు వెల్లడి చేస్తున్నాడు. అట్టి దామోదర భగవానునికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామములను అర్పిస్తున్నాను.
(4) ఓ దేవా! నీవు అన్నిరకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడ వైనప్పటికినీ నేను నిరాకార ముక్తిని గాని, వైకుంఠములో శాశ్వత జీవితము నిచ్చే సర్వోత్తమ ముక్తిని గాని, నవ విధ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరమును గాని కోరను. ఓ స్వామీ! నేను కేవలం వృందావనములో బాలగోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయములో ప్రకటితము కావాలనీ కోరుకుంటున్నాను. ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనమేమిటి?
(5) ఓ స్వామీ, నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ ముఖ పద్మమును యశోదామాత పదేపదే ముద్దులాడుతోంది మరియు నీ పెదవులు బింబాఫలముల వలే ఎర్రగా నున్నవి. నీ ముఖ పద్మము యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయంలో సదా ప్రకటితమగు గాక! వేలకువేల ఇతర వరములతో నాకు అవసరము లేదు.
(6) ఓ దేవాదిదేవా! నేను నీకు నా ప్రణామములు అర్పిస్తున్నాను. ఓ దామోదరా! ఓ అనంతా! ఓ విష్ణో! ఓ ప్రభు! ఓ నా స్వామీ, నాపై కృప జూపుము. నాపై నీ కృపాదృష్టిని వర్షించి, ప్రాపించిక దుఃఖసాగరములో మునిగిన ఈ మూర్ఖుని ఉద్ధరింపుము. నా కళ్ళకు దర్శన మోసగుము.
(7) ఓ దామోదరా! ఏ విధముగానైతే నీవు చెక్కరోటికి కట్టబడిన తరువాత కుబేరుని ఇద్దరు పుత్రులైన నలకుబేర, మణిగ్రీవులను నారదుని శాపము నుండి విముక్తి కలిగించి మహాభక్తులుగా మార్చావో, అదే విధముగా నాకు నీ పట్ల ప్రేమభక్తిని ప్రసాదించుము. నేను కేవలం దీనికొరకై పరితపిస్తున్నాను. మరే ఇతరమైన ముక్తిని నేను ఆశించను.
(8) ఓ దామోదరా! నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణామములను అర్పిస్తున్నాను. తరువాత విశ్వమంతటికీ నెలవైనట్టి నీ ఉదరమునుకు నా ప్రణామములను అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారాణికి నా వినయ పూర్వక ప్రణామములు మరియు అనంతలీలను ప్రదర్శించే, దేవాదిదేవుడవైన నీకు నా సమస్త ప్రణామములను అర్పిస్తున్నాను.