తులసి ఆరతి
తులసి ఆరతి
తులసి ఆరాధన
"తులసి అన్ని విధాలుగా శుభకరమైనది. మామూలుగా చూడటం ద్వారా, తాకడం ద్వారా, ప్రార్ధించడం ద్వారా, వందనం చేయడం ద్వారా, తులసి గురించి వినడం ద్వారా, లేదా తులసి మొక్కను నాటడం ద్వారా ఎల్లప్పుడూ శుభకరముగా నుండును. ఈ విధముగా ఎవరైనా తులసి చెంత ఉండటం ద్వారా వారు శాశ్వతంగా వైకుంఠములో నివసించగలరు." -- స్కంద పురాణం
భక్తులు తులసి ఆరాధన ఎందుకు చేయాలి?
తులసి మొక్కకు ఆ పేరు శ్రీ కృష్ణునికి మిక్కిలి ప్రియమగు శాశ్వత పరిచారి, ఆధ్యాత్మిక ప్రపంచంలో గోపి రూపమున జీవించూండు ఒక శుద్ధ భక్తురాలు, అయిన శ్రీమతి తులసి దేవి వలన వచ్చింది. ఆమె యొక్క సాక్షాత్కారమే ఈ తులసి చెట్టు. తులసి కృష్ణునికి ప్రియముగునది అగుట వలన, తులసిని ఆరాధించడం ద్వారా సకల శుభములను పొందుదురు. ఆమె దయ వలన, ఎవరైనా కూడా త్వరితగతిన ఆధ్యాత్మిక పురోగతి నొంది, ఆధ్యాత్మిక లోకమున ప్రవేశించుటకు అర్హత పొందేదరు
తులసి ఆరతి ఏ విధంగా చెయ్యాలి?
తులసి పూజను దాదాపుగా చాలా సులభంగా చేయవచ్చు. దీనికి కావలసిన పూజ ద్రవ్యాలు మూడు మాత్రమే: అగరబత్తి, ఒక నేతి దీపం, మరియు పువ్వులు.
తులసిని పూజించే ముందు ఈ క్రింది తులసి ప్రణామ మంత్రమును మూడు సార్లు చెప్పండి.
వృందాయై తులసీదేవ్యాయై ప్రియాయై కేశవస్య చ
విష్ణుభక్తిప్రదే దేవీ! సత్యవత్యాయై నమో నమః
కేశవునికి ప్రియమైన ఓ వృందాదేవీ! తులసీ దేవీ! నీవు విష్ణుభక్తిని ప్రసాదింపగలదానివి మరియు పరమ సత్యవతివి. అటువంటి నీకు నా పరిపరి ప్రణామములు.
గది మధ్యలో ఒక బల్ల లేదా ఎత్తు పీట మీద తులసిని ఉంచండి. తులసి ఆరతి పాటను పాడుతూ క్రింది తెలిపిన విధంగా ఆరతి ఇవ్వండి.
ఆచమనం (పవిత్రీకరించుటకు)
ఆచమన పాత్ర నందలి స్పూన్ తో నీరు తీసుకుని, రెండు చేతులను శుద్ధి చేసుకోండీ.
ఒక స్పూన్ నిండుగా నీరు కుడి చేతిలో తీసుకుని, "ఓం కేశవాయ నమః" అని ఉచ్చరిస్తూ ఆ నీటిని త్రాగండి.
ఒక స్పూన్ నిండుగా నీరు కుడి చేతిలో తీసుకుని, "ఓం నారాయణ నమః" అని ఉచ్చరిస్తూ ఆ నీటిని త్రాగండి.
ఒక స్పూన్ నిండుగా నీరు కుడి చేతిలో తీసుకుని, "ఓం మాధవాయ నమః" అని ఉచ్చరిస్తూ ఆ నీటిని త్రాగండి.
అగరబత్తిని అర్పించుట
గంట మరియు అగరబత్తి స్టాండును ఒక స్పూన్ నీటిని చిలకరిస్తూ శుద్ధి చేయండి.
అగరబత్తిని వెలిగించండి.
ఎడమ చేతితో గంట తీసుకుని, పూజ చేయునంత సేపు మ్రోగించండి.
కుడి చేతితో అగరబత్తిని తీసుకుని, తులసి చుట్టూ ఏడు సార్లు అర్పించండి.
శ్రీల ప్రభుపాదకి, ఆ తరువాత భక్తులందరికి అర్పించండి.
నేతి దీపమును అర్పించుట
నేతి దీపమును ఒక స్పూన్ నీటిని చిలకరిస్తూ శుద్ధి చేయండి.
దీపం వెలిగించండి.
తులసికి అర్పించండి: గుండ్రంగా మొదలుకి నాలుగు సార్లు, మధ్యన రెండు సార్లు, పై భాగానికి మూడు సార్లు, మరియు తులసి మొత్తానికి ఏడు సార్లు అర్పించండి.
శ్రీల ప్రభుపాదకి, ఆ తరువాత భక్తులందరికి అర్పించండి.
పుష్పములను అర్పించుట
పుష్పాలను ఒక స్పూన్ నీటిని చిలకరిస్తూ శుద్ధి చేయండి.
గుండ్రంగా ఏడు సార్లు తిప్పుతూ తులసి మొత్తానికి అర్పించండి
ఒక పుష్పమును మొదటి యందు ఉంచవచ్చును.
శ్రీల ప్రభుపాదకి, ఆ తరువాత భక్తులందరికి అర్పించండి.
ఆ తరువాత తులసి ప్రదక్షిణ మంత్రం చెప్పుతూ, తులసికి ప్రదక్షిణం చేయండి.
(1) నమో నమః తులసీ! కృష్ణ ప్రేయసీ నమో నమః
రాధాకృష్ణసేవా పాబో ఏయ్ అభిలాషీ
(2) జే తొమార శరణ లోయ్, తారా వాంఛా పూర్ణ హోయ్
కృపా కోరి' కోరో తారే బృందావనబాసీ
(3) మోర ఏయ్ అభిలాష్, బిలాస్ కుంజే దియో వాస్
నయనే హేరిబో సదా జుగలరూపరాశి
(4) ఏయ్ నివేదన ధరో, సఖీరనుగత కోరో
సేవా అధికార దియే కోరో నిజ దాసీ
(5) దీన కృష్ణదాసే కోయ్, ఏయ్ జేన మోర హోయ్
శ్రీ రాధాగోవింద ప్రేమే సదా జేన భాసీ
శ్రీకృష్ణభగవానునికి ప్రియమైన ఓ తులసీ దేవీ! నీకు నా పరిపరి ప్రణామములు. శ్రీశ్రీ రాధాకృష్ణుల సేవా భాగ్యము పొందాలనేదే నా అభిలాష.
ఎవరైతే నీ శరణు పొందుదురో వారి వాంఛలన్నీ నెరవేర్చబడును. నీవు వారిపై కృప చూపి, వారిని వృందావన వాసులను చేసెదవు.
నీవు నాపై కృప చూపి వృందావనములోని విలాస కుంజములలో నివాసమిచ్చినచో, శ్రీశ్రీ రాధాకృష్ణుల యొక్క అందమైన లీలలను ఎలప్పుడు దర్శనము చేసుకోగల ననునదే నా అభిలాష.
నన్ను వ్రజధామములోని గోపికల అనుచరుని చేయుమని నేను నిన్ను వేడుకొంటున్నాను. దయచేసి నాకు భగవత్సేవను చేసే అవకాశాన్ని కల్పించి, నన్ను నీ దాసునిగా చేసుకొనుము.
సర్వదా శ్రీశ్రీ రాధా గోవిందుల ప్రేమలో మునిగి తేలాలని, అతి దీనుడైన ఈ కృష్ణదాసుడు నిన్ను ప్రార్థిస్తున్నాడు.
తులసికి కనీసం నాలుగు సార్లు ప్రదక్షిణం చేస్తూ ఈ క్రింది మంత్రం చెప్పండి.
యాని కాని చ పాపాని బ్రహ్మ హత్యాదికాని చ
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణః
శ్రీ మతి తులసిదేవికి ప్రదక్షిణ చేయుట ద్వారా మన పాపములన్నింటితో పాటు బ్రాహ్మణుని చంపిన పాపము కూడా నశించును.
తులసిని జాగ్రత్తగా చూసుకొనుట
భక్తియుత సేవకు తులసి మొక్క మరియు తులసి ఆకులు చాలా ముఖ్యమైనవి. ప్రతి రోజు భక్తులు తులసికి నీరు పోయుట మరియు భగవంతునికి తులసి ఆకులు కోయుట అనేవి విధిగా చేయాలి అని తెలుపబడింది. --- శ్రీ మద్భాగవతం 3.15.9 భాష్యం
తులసి మహత్మ్యం: ఎవరైనా ఎక్కడైనా ఒక తులసి మొక్కను నాటితే, వారు శ్రీ కృష్ణునికి భక్తులు అవుతారు. కృష్ణుని పాదాలకు భక్తితో తులసి ఆకులను అర్పిస్తే, వారిలో భగవత్ప్రేమ సంపూర్ణంగా వృద్ధి చెందును. -- స్కంద పురాణం
విష్ణువుకు తులసి చాలా చాలా ప్రియము. విష్ణు తత్త్వ శ్రీ విగ్రహాలకు తులసి ఆకులు మెండుగా అవసరము. శ్రీ విష్ణుకు తులసి మాల ప్రీతికరం. తులసి ఆకుతో గంధం తీసుకుని, ఆ భగవంతుని పాదాల చెంత ఉంచడం అనేది ఉత్తమోత్తమమైన ఆరాధన. -- గోవిందకు శ్రీల ప్రభుపాద లేఖ, 7 ఏప్రిల్ 1970
తులసి ఆకులను పగటి సమయమున ప్రత్యేకించి దీని కొరకే ఉంచిన ఒక కత్తెరతో కోయాలి. చీకటి పడిన తరువాత కోయరాదు.
తులసి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ లేదా అర్ఘ్యం అర్పించేప్పుడు కానీ తులసికి ఎలాంటి బాధ కలుగకుండా చూసుకోవాలి.
తులసి ఒక సాధారణ మొక్క కాదు, ఒక గొప్ప శుద్ధ భక్తురాలు అని గుర్తుపెట్టుకోండి.
తులసి మంజరిలు మొదలవగానే తెంపేయండి, లేదంటే వాటి విత్తనాల నుండి చాలా మొక్కలు వచ్చి మనం సరియైన శ్రద్ధ తీసుకోలేకపోవచ్చు. ఈ విధంగా చేయడం వలన తులసి కూడా బలంగా మరియు ఆరోగ్యవంతంగా ఎదుగుతుంది.
జంతువులు వలన తులసికి ఎలాంటి ఇబ్బంది రాని ప్రదేశంలో ఉంచండి (కుక్కలు మూత్రం పోస్తాయి, గొర్రెలు ఆకులు తింటాయి). నడిచే మార్గానికి దూరంగా ఉంచాలి, లేదంటే మార్గంలో వెళ్ళే జనులు తెలియకుండా తాకే అవకాశం ఉంది. తులసిని గౌరవించడం పిల్లలకు (పెద్దలకు కూడా) నేర్పాలి. వేసవి కాలంలో నీడలో ఉంచాలి, 43 డిగ్రీల ఎండ అంతగా తులసికి నచ్చదు. చలి ప్రదేశాలలో ఉన్నవారు, తులసి వద్ద కృత్రిమ వెలుతురును ఉపయోగించాలి.
తులసి నందు ఔషధ గుణములు ఉన్ననూ, ఆ విధంగా ఆలోచించరాదు. ఆమె శుద్ధ భక్తురాలు మరియు మనచే పూజార్హురాలు. మరి ఏ ఇతర కారణంతో కాకుండా తమ భక్తిని వృద్ధి చేసుకొనుటకు మాత్రమే భక్తులు తులసిని పెంచాలి. భక్తితో విష్ణు శ్రీవిగ్రహ మరియు ప్రతిమల పాదాలకు తులసి ఆకులను అర్పించాలి, మరి ఏ ఇతరలెవరికి అర్పించరాదు. అనగా తులసి ఆకులను శ్రీ కృష్ణుని, శ్రీ నరసింహదేవునికి, శ్రీ చైతన్య మహాప్రభుకి, శ్రీ నిత్యానంద ప్రభుకి, అద్వైత ప్రభు మొదలైన వారి పాదాలకు మాత్రమే అర్పించాలి. రాధారాణి, గదాధర పండితుడు, శ్రీనివాస పండితుడు, మరియు పరంపర ఆచార్యుల పాదాలకు అర్పించరాదు. శ్రీ విగ్రహారాధన నందు కృష్ణుని పాదాలకు అర్పించడానికి గురువు కుడి చేతి యందు తులసిని ఉంచవచ్చు. భోగ (భగవంతుని కొరకు చేసిన పదార్ధాలు) నివేదనకు కూడా తులసి ఆకులు చాలా అవసరము.
ఈ క్రింది మంత్రమును తులసి ఆకులను కోయునప్పుడు ఉచ్చరించాలి.
ఓం తులస్యమృత జన్మాసీ సదా త్వం కేశవప్రియా
కేశవార్థం చినోమి త్వాం వరదా భవ శోభనే