ఏకాదశి
ఏకాదశి
ఏకాదశి అనేది అమావాస్య మరియు పౌర్ణమిల తర్వాత వచ్చు పదకొండవ రోజు (పక్షానికి ఒకసారి). ఈ ప్రత్యేక దినములలో భక్తులు ఉపవాసం ఉండి భక్తియుత సేవ కార్యాలలో పాల్గొనుటకు అదనంగా కృషి చేస్తారు.
"ప్రతి ఒక్కరూ భక్తియుత సేవ నందు సంపూర్ణ తపస్సుతో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ రెండు ఏకాదశిల నాడు, అమావాస్య మరియు పౌర్ణమిల తర్వాత వచ్చు పదకొండవ రోజు, మరియు శ్రీ కృష్ణ భగవానుని, శ్రీ రాముని, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జన్మదినములలో ఉపవాసం చేయాలి. "
-- శ్రీ మద్భాగవతం 3.7.22 భాష్యం
ఏకాదశిని పాటించు విధానము
ధాన్యములు మరియు పప్పులు తీసుకొనరాదు
అదనపు జప మాలలు చేయాలి
అదనంగా పుస్తక పఠనం చేయాలి
శ్రవణం, జపము, మరియు కృష్ణుని భక్తి యుత సేవలో ఎక్కువగా నిమగ్నమగుటకు ప్రయత్నించాలి
ఒక అడుగు వెనకకు వేయుటకు ఇది సమయము, సాధారణ దైనందిన జీవనం నుండి కొంచెం బయటకు రండి, మీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఎలా సాగుతుందో చింతన చేయండి
శారీరిక భావన కంటే ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నించండి; శారీరిక కార్యక్రమములను సాధ్యమైనంత చేయకండి (గెడ్డం గీసుకోవటం, బట్టలు ఉతకడం, డాక్టర్ దగ్గరకు వెళ్ళడం, షాపింగ్, నిద్రించటం)
అధిక శారీరిక శ్రమ చేయకండి. దూర ప్రాంతాలకు ప్రయాణించవద్దు.
ఉపవాసము
ఉపవాసము అతిగా చేయరాదు. అది భావనని మాత్రమే కలిగించాలి తప్ప నిరసానికి కారణం కారాదు. ఓపికకి తగినట్లుగా మాత్రమే ఉపవాసం చేయాలి.
ఉపవాస ఫలితములు
ఇది త్యజించుట నందలి రుచిని తెలుపుతుంది, ఆ విధంగా ఇంద్రియ తృప్తిని విడిచిపెట్టుటలో సహాయపడుతుంది.
ఉపవాసము వలన ఈ దేహ యంత్రము విశ్రమిస్తుంది: కొంచెం అతిగా లేదా విచ్చలవిడి తిండి తినడం వలన శరీరము ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఉపవాసము ద్వారా శరీరము కుదుటబడుటకు అవకాశం కలుగుతుంది.
తినుట యందు స్వీయ నియంత్రణ పాటించడానికి మరియు భగవంతున్ని ప్రసన్నం చేసుకోవడంలో లగ్నమగుటకు ఉపవాసము ఉపయోగపడుతుంది.
శరీరము తేలికబడుటకు మరియు పొట్ట కాలిగా ఉండుటకు ఉపవాసము ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఒకరు మంచిగా ధ్యానించవచ్చు.
ఉపవాసము చేయుటలో రకాలు
ఉపవాసము చేయువారు ఏకాదశిని వివిధ స్థాయిలలో చేయుదురు:
అన్ని రకాల తినుబండారాలు మరియు నీటి నుండి పూర్తిగా ఉపవాసముండుట ( అయిననూ ఆచమనము మరియు చరణామృతము తీసుకోవచ్చు)
నీరు మాత్రమే తీసుకుంటూ, అన్ని రకాల తినుబండారాలు నుండి పూర్తిగా ఉపవాసముండుట
నీరు మరియు కొంచెం ఫలం తీసుకొనుట
నీరు తీసుకుంటూ మరియు మధ్యాహ్నము భుజించుట
ఎలాంటి ధాన్యము మరియు పప్పులు లేకుండా మామూలుగా తినుట మరియు త్రాగుట
ఏకాదశి మహాత్య్మం:
(ఈ వ్యాసం మొట్టమొదట శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యుడైన శ్రీ నవీంచంద్ర చక్రవర్తిచే 1956లో వ్రాయబడింది. వెంకట దాస్ బ్రహ్మచారి 1979లో
ఇంగ్లిష్ లోకి అనువదించారు.)
చాలా మంది భక్తులు శ్రీ ఏకాదశి ఆవిర్భావము మరియు ఆమె యొక్క విశేష లక్షణములు తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు. అందువలన నేను దీనిని
పద్మ పురాణం "క్రియ సాగర సార" భాగము 14వ అధ్యాయము నుండి వ్రాయుచున్నాను.
ఒకానొక్కప్పుడు జైమిని ఋషి తన గురువైన శ్రీల వ్యాస దేవునితో ఇట్లు పలికెను, "ఓ గురుదేవ! మీ దయ వలన ఇంతకు పూర్వం మీ నుండి గంగా నది
మహాత్మ్యం, విష్ణు ఆరాధన లాభములు, ధాన్యము ధానమునిచ్చుట, నీరు ధానము చేయుట, బ్రాహ్మణుల కాళ్ళు కడిగిన నీటిని త్రాగుట యందలి
మహత్మ్యం తెలుసుకున్నాను." ఓ ముని పుంగవ, శ్రీ గురుదేవ, ఇప్పుడు గొప్ప ఆతృతతో ఏకాదశి ఉపవాసము వలన కలుగు లాభములు మరియు ఏకాదశి
ఆవిర్భావం గురించి వినాలని కోరుకుంటున్నాను.
కస్మాద్ ఏకాదశీ జత తస్యాః కొ వా విధిర్ ద్విజ
కద వా క్రియతే కిం వా ఫలం కిం వా వదస్వ మే
కా వా పూజ్యతమా తత్ర దేవతా సద్గుణార్ణవ
అకుర్వతః స్యాత్కొ దోష ఏతాన్ మే వక్తుం అర్హసి
"ఓ గురుదేవ! ఏకాదశి ఎప్పుడు మరియు ఎవరి నుండి ఆవిర్భవించింది? ఏకాదశి నాడు ఉపవాసం చేయుటకు గల నియమాలు ఏమిటి? ఇది ఎప్పుడు
పాటించాలి? ఈ ప్రమాణము పాటించుట వలన కలుగు లాభములు ఏమి? శ్రీ ఏకాదశి నాడు మిన్నగా ఆరాధించదగు దైవం ఎవరు? ఏకాదశి సరిగా
పాటించకపోవుట వలన నష్టమేమీ? మీరు మాత్రమే తెలుపుగలరు, కావున దయచేసి నా పై కరుణ చూపి, వీటినన్నిటిని నాకు తెలుపండి."
జైమిని నుండి ఈ ప్రశ్నలు విన్న శ్రీ వ్యాసదేవుడు అలౌకికమైన పరమానంద భరితుడయ్యేను. "ఓ బ్రహ్మర్షి జైమిని! ఏకాదశి గురించి పూర్తిగా చెప్పగల
సామర్ధ్యం భగవంతుడు శ్రీ నారాయణుడు మాత్రమే కలిగి ఉండుట వలన ఏకాదశి పాటించుట వలన కలుగు ఫలితములు ఆ నారాయణుడే
పరిపూర్ణంగా వివరించగలరు." అయిననూ నీ ప్రశ్నకు సమాధానంగా నేను చాలా చిన్న వివరణ ఇచ్చేదను.
"ఈ భౌతిక జగత్తు సృష్టించే ఆరంభంలో, ఐదు స్థూల భౌతిక పదార్ధాలతో తయారుచేయబడిన చరాచర జీవులను భగవంతుడు సృష్టించాడు. అదే
సమయాన మానవులను శిక్షించుటకు, పాపమే రూపముగా గల వ్యక్తి (పాపపురుషుడు) ని సృష్టించెను. ఈ వ్యక్తి యొక్క వివిధ అవయవములు వివిధ
పాపపు కార్యాలతో చేయబడినవి.
అతని తల బ్రాహ్మణ హత్య చేసిన పాపంతో చేయబడినది,
అతని కళ్ళు మత్తు పానీయాలు స్వీకరించుట ద్వారా వచ్చు పాప రూపము,
అతని నోరు బంగారం దొంగిలించుట వలన వచ్చు పాపంతో చేయబడినది,
అతని చెవులు ఆధ్యాత్మిక గురువు యొక్క భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన కలిగిన పాపపు రూపం,
అతని ముక్కు ఒకరి భార్యను చంపటం వలన కలిగిన పాపంతో చేయబడినది,
అతని భుజములు ఒక ఆవును చంపటం వలన కలిగిన పాపంతో చేయబడినది,
అతని మెడ దాచుకున్న డబ్బు దొంగిలించుట వలన కలిగిన పాపంతో చేయబడినది,
అతని ఛాతీ గర్భ స్రావం వలన కలిగిన పాపం,
అతని ఛాతీ క్రింది భాగం పరాయి వాళ్ళ భార్యతో మైథునం వలన కలుగు పాపం,
అతని పొట్ట ఒకరి బంధువునును చంపటం వలన కలిగిన పాపంతో చేయబడినది,
అతని బొడ్డు అతనిపై ఆధారపడిన వాళ్ళని చంపటం వలన కలిగిన పాపంతో చేయబడినది,
అతని నడుము ప్రదేశం సొంత గొప్పలకు పోవుట వలన కలుగు పాపం,
అతని తొడలు గురువును దుర్భాషలాడుట వలన కలుగు పాపం,
అతని మర్మాంగాలు ఒకరి కుమార్తెను అమ్ముట వలన కలుగు పాపం,
అతని పిరుదులు గోప్యమైన విషయాలను బట్ట బయలు చేయుట వలన కలుగు పాపం,
అతని పాదములు ఒకరి తండ్రిని చంపటం వలన కలిగిన పాపం,
అతని వెంట్రుకలు అంత తీవ్రము కాని పాపపు పనులు వలన కలిగిన పాపంతో చేయబడినది
ఈ విధంగా అన్నీ పాపపు కార్యాలు మరియు దుర్గుణాలు సమ్మేళనంగా గల ఒక భీకరమైన వ్యక్తి చేయబడినాడు. అతని శరీర ఛాయ నలుపు మరియు కళ్ళు పసుపుగా ఉంటాయి. అతను పాపులకు తీవ్రమైన బాధలను కలుగచేస్తాడు."
"దేవాదిదేవుడు, శ్రీ విష్ణు, ఈ పాపపురుషుడుని చూస్తూండగా ఇట్లు ఆలోచించడం మొదలుపెట్టెను: 'నేను ఈ జీవులకు సుఖ దుఃఖాలను సృష్టించువాడిని. నేను ఈ జీవులకు ప్రభువును ఎందుకనగా ఎవరైనా పాపపు, అవినీతీ, మోసపు జీవులను బాధించుటకు నేను ఈ పాపపురుషుడను సృష్టించాను. ఇప్పుడు ఈ వ్యక్తిని నియంత్రించగల వారెవరినైనా నేను సృష్టించాలి.' ఆ సమయంలో, యమరాజు మరియు వివిధ నరక లోకాలనూ భగవంతుడు సృష్టించెను. ఆ విధంగా పాపులు మరణాంతరం యమరాజు వద్దకు పంపబడి, వారి వారి పాపాలకు తగిన రీతిగా శిక్ష అనుభవించుటకు నరక లోకానికి పంపబడును."
"జీవులకు సుఖ దుఃఖాలను ఇచ్చు భగవంతుడు, ఈ విధమైన సర్దుబాట్లు చేసిన తర్వాత, పక్షుల రాజైన గరుడు సాయంతో యమపురికి వెళ్ళెను. శ్రీ విష్ణువును చూడగానే యముడు వెంటనే ఆయన పాదాలను కడిగి, ఒక బంగారు సింహాసనంపై కూర్చుండపెట్టెను. శ్రీ విష్ణువు సింహాసనంపై కూర్చోనగానే దక్షిణ దిక్కు నుండి చాలా బిగ్గరగా ఉన్న రోధనలు వినెను. ఆయన ఆశ్చర్యం నొంది యముడుని 'ఈ బిగ్గరమైన ఏడుపులు ఎక్కడ నుండి వస్తున్నాయి?' అని విచారించెను."
"దానికి సమాధానంగా యమరాజు ఈ విధంగా చెప్పెను, 'ఓ దేవా! భూ గ్రహము నందలి వివిధ జీవులు నరక లోకాలలో పడినారు. వారి దుష్ట కార్యాలకు వారు తీవ్రంగా అనుభవిస్తున్నారు. ఈ ఘోర రోధనలు వారి గతంలోని చేసిన తప్పుడు కర్మలకు అనుభవించుచున్న వేదనలే. ' "
"ఇది విన్న దేవాదిదేవుడు, శ్రీ విష్ణువు, దక్షిణాన ఉన్న నరకానికి వెళ్ళెను. వచ్చినది ఎవరో చూసి ఆ నరకవాసులు ఇంకా గట్టిగా ఏడ్చేను. దేవాదిదేవుడు, శ్రీ విష్ణువు హృదయం దయతో నిండింది. నేను వీరినందరిని సృష్టించాను. దాని ఫలితంగా వారు బాధపడుతున్నారు."
శ్రీల వ్యాసదేవుడు చెప్పడం కొనసాగించెను: "ఓ జైమిని, దేవాదిదేవుడు తరువాత ఏమి చేసేనో వినుము."
ఏతచ్చాన్యచ్చ విప్రర్షే విచిన్త్య కరుణామయః |
బభూవ సహసా తత్ర స్వయమేకాదశి తిథి: ||
--పద్మ పురాణం 7.22.27
'దయ గల భగవంతుడు తాను మునుపు అనుకున్నదాని గురించి ఆలోచిస్తుండగా, ఒక్కసారిగా తన రూపం నుండి చాంద్రమాన ఏకదశిగా వ్యక్తమయ్యెను.' ఆ తరువాత నుండి వివిధ పాపులు ఏకాదశి వ్రతం ఆచరిస్తూ త్వరితగతినే వైకుంఠ ధామానికి చెరుకొనేను. ఓ జైమిని, నా ప్రియమైన బిడ్డ, అందువలన చాంద్రమాన ఏకదశి ఆ భగవంతుని, విష్ణువు, మరియు జీవుల హృదయమందలి పరమాత్మ రూపమే. శ్రీ ఏకాదశి అత్యున్నత పుణ్య కార్యము మరియు అన్నీ వ్రతములలోకెల్ల ఉన్నతంగా నెలకొన్నది.
శ్రీ ఏకాదశి యొక్క ఉన్నతిని గమనించి, ఆమె యొక్క ప్రభావం చూసి పాపపు కార్యాల రూపమైన పాపపురుషుడు హృదయంలో సందేహాలతో శ్రీ విష్ణువుని వద్దకు వెళ్ళి ప్రార్థించుట ఆరంభించెను. అందువలన శ్రీ విష్ణు ఎంతో సంతోషించి ఈ విధంగా చెప్పెను, 'నీ ప్రార్థనలతో నేను ఎంతో సంతోషించితిని, నీకు ఏ వరం కావాలి అని అడిగెను?'
"పాపపురుషుడు ఈ విధంగా చెప్పెను,'నేను నీ సంతానమును, నా ద్వారా కడు పాపాత్ములు దుఃఖితులు కావాలనేది నీ తలంపు. కానీ ఇప్పుడు, ఏకాదశి ప్రభావంతో, నేను మొత్తానికి అంతరించిపోయాను. ఓ ప్రభు! నా మరణం తరువాత నీ అంశలై యుండి భౌతిక దేహం తీసుకున్న జీవులు ముక్తినొంది, వైకుంఠ ధామానికి తిరిగి పోవును. ఈ జీవులన్నీ ముక్తినొందితే, నీ కార్యాలను నిర్వహించేదేవరు? ఈ భూలోకంలో నీవు లీలలు చేయుటకు ఎవరూ ఉండరు! ఓ కేశవ! నీవు ఈ సనాతనమైన లీలలను కొంసాగించాలంటే, అప్పుడు ఏకాదశి వలన కలుగుతున్న భయం నుండి నీవు నన్ను రక్షించు. ఎలాంటి పుణ్య కర్మ నన్ను బంధించలేదు. కానీ ఏకాదశి మాత్రమే, నీ స్వీయ రూపమైనందున, నన్ను అడ్డుకుంటుంది. శ్రీ ఏకాదశి వలన భయంతో నేను పారిపోయి మానవులు, జంతువులు, పురుగులు, కొండలు, చెట్లు, చరాచర జీవులు, నదులు, సముద్రములు, అడువులు, స్వర్గము, భూలోకం, నరక లోకాలు; ఉపదేవతలు; మరియు గంధర్వులును ఆశ్రయించాను. నేను ఏకాదశి వలన కలుగు భయం నుండి బయటపడుటకు ఏ ప్రదేశం నాకు కనిపించలేదు. ఓ ప్రభూ! నేను నీ యొక్క సృష్టిని, అందువలన దయచేసి నేను భయరహితుడగా ఉండగల ప్రదేశం ఏమిటో తెలుపుము.'"
శ్రీల వ్యాసదేవుడు జైమినితో చెప్పెను: "ఆ విధంగా చెప్పిన తరువాత పాపపురుషుడు దేవాదిదేవుడు, అన్నీ పాపాలను నశింపచేయు విష్ణువు, పాదాల వద్ద పడి ఏడ్వడం మొదలుపెట్టెను."
"ఆ తరువాత, పాపపురుషుని స్థితి చూసి శ్రీ విష్ణు నవ్వుతూ, ఈ విధంగా మాట్లాడెను: 'ఓ పాపపురుష! పైకి లెమ్ము ! ఇక ఏ మాత్రం చింతించవద్దు. నా మాట విను. నీవు పవిత్ర దినమైన చాంద్రమాన ఏకాదశి నాడు యెక్కడ నివసించాలో నేను చెబుతాను. ముల్లోకాలకు ఉపకారి అయిన ఏకాదశి నాడు, ధాన్యం రూపంలో ఉన్న ఆహారం నందు ఆశ్రయం పొందుము. దీని కొరకు ఏ మాత్రం చింతించవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఇక నా రూపమైన ఏకాదశి నిన్ను ఏ మాత్రం అడ్డుపడదు.' పాప పురుషుణుకి మార్గనిర్దేశం ఇచ్చిన తరువాత, దేవాదిదేవుడు, విష్ణు, అంతర్ధానమయ్యేను. పాపపురుషుడు తన కార్యనిర్వహణకు వెడలిపోయేను."
"అందువలన ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం కొరకు పట్టుదలగా నున్న వ్యక్తులు, ఏకాదశి నాడు అస్సలు ధాన్యం తినరు. శ్రీ విష్ణువు సూచనలు మేరకు, ఈ భౌతిక జగత్తు నందలి ప్రతి పాపపు కార్యం ఈ ఆహారం (ధాన్యం) నందు నివాసముందును. ఎవరైతే ఏకాదశిని పాటిస్తారో, వారు పాప విముక్తులై నరక లోకాలకి ఎప్పుడూ వెళ్లరు. మాయ ప్రభావము నందలి ఉన్నా కూడా ఏకాదశిని పాటించకపోతే వారు మిక్కిలి పాపిగానే పరిగణించబడును. తిన్న ప్రతి ముద్ద ధాన్యానికి భూలోక వాసికి పది లక్షల బ్రాహ్మణులను చంపిన నేరం మోపబడును. ఏకాదశి నాడు ధాన్యమును ఆహారంగా స్వీకరించుట మానుకోవడం తప్పనిసరి. నేను మరలా మరలా గట్టిగా చెబుతున్నా, 'ఏకాదశి నాడు , ధాన్యం తినవద్దు, ధాన్యం తినవద్దు, ధాన్యం తినవద్దు!' ఒకరు క్షత్రియ, వైశ్య, శూద్ర, లేదా ఏ జాతి వారు అయినా సరే, వారు చాంద్రమాన ఏకాదశి తప్పకుండ పాటించాలి. దీని ద్వారా వర్ణాశ్రమ పరిపూర్ణత సిద్ధిస్తుంది. నిజానికి వేరొకరి మోసానికి ఒకరు ఏకాదశి పాటించినా, వారి పాపమంతా నశించి చాలా సులభంగా ఉత్తమ లక్ష్యమైన, వైకుంఠ ధామాన్ని పొందును."